16, ఆగస్టు 2019, శుక్రవారం

మాలదాసరి కథ (ఆముక్తమాల్యద)

మాలదాసరి కథ

--యథాశక్తి వచనానువాదం

పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


(ఇది శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద పద్యకావ్యంలోని మాలదాసరి కథకు నా వచనానువాదం. ఈ కథ ఆముక్తమాల్యదలో షష్ఠాశ్వాసంలో, చివరి కొద్దిభాగం సప్తమాశ్వాసంలో వస్తుంది. ఇందులో కథాభాగాలు-

విషయసూచిక
1.    భక్తిగీత ప్రభావము నిరూపించుటకు స్వామి చెప్పుట-
2.    మాలదాసరి దారితప్పుట-
3.    మాలదాసరికి బ్రహ్మరాక్షసుడు ఎదురుబడుట-
4.    బ్రహ్మరాక్షసునితో మాలదాసరి పెనుగులాట-
5.    బ్రహ్మరాక్షసుడికి దాసరి హితబోధ చేయుట-
6.    బ్రహ్మారాక్షసుడు హితబోధను పెడచెవిని పెట్టుట-
7.    దాసరి కీర్తన వ్రతానికై కురుంగుడికి వెళతానని వేడుకొనుట-
8.    తిరిగి వచ్చిన దాసరిని చూసి రాక్షసుని మనస్సు మారుట-
9.    బ్రహ్మరాక్షసుని విన్నపము-
10.      దాసరికి రాక్షసునికి పాటఫలవిషయమై సంవాదం-
11.      బ్రహ్మరాక్షసుని పూర్వవృత్తాంతము; సోమశర్మ కథ-
12.      దొంగలముఠా దాడి చేయుట-
13.      సోమశర్మ దుర్గతి-
14.      భాగవత పరిచయము వలన బ్రహ్మరాక్షసుడు సోమశర్మగా అగుట-
 



శ్రీమహాగణాధిపతయే నమః

1.   భక్తిగీత ప్రభావము నిరూపించుటకు స్వామి చెప్పుట-


          పూర్వం వామనావతారంలో శ్రీమహావిష్ణువు నివసించిన ప్రదేశం దక్షిణదేశంలో కురుంగుడి. అక్కడ శ్రీమహావిష్ణువు ఆలయం ఉన్నది. ఆ కురుంగుడికి మూడు యోజనాల దూరంలో ఉన్న గ్రామంలో ఒక దాసరి ఉండేవాడు. అతడు అంత్యకులంలో పుట్టటం వల్ల ‘మాలదాసరి’ అని పిలువబడేవాడు. జాతి చేత ఛండాలుడైనా, అతని గుణశీలాలు అగ్రవర్ణంలో పుట్టిన వాళ్ళకేమీ తీసిపోయేవి కావు. మట్టిగుడ్డలో చుట్టిన మాణిక్యం లాంటివాడు.

          ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో ఆ దాసరి, కురుంగుడి దేవాలయానికి వెళ్ళి, దేవాలయ ప్రవేశం నిషిద్ధం కనుక గుడి బయటనే ఉండి, చలి, వాన, ఎండ మొదలైన వాటిని గణించక, తన వీణను మీటుతూ మంగళ కైశికి రాగంలో పెరుమాళ్ళును కీర్తించేవాడు. అలా మధ్యాహ్నం వరకు పాడుతూ భక్తి పారవశ్యంతో తాండవం చేసేవాడు. అలా స్వామిని సేవించి, తన కాళ్ళూ, చేతులూ, వక్షమూ, నొసలూ, భుజాలూ నేలకు తగిలేలా సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఆ తరువాత గర్భాలయం కడుగగా బయటకు వచ్చిన నీటిని శూద్రడెవరైనా తీసుకుని వచ్చి ఇవ్వగా ఆ పవిత్ర తీర్థాన్ని సేవించి, పరవశం పొందేవాడు. బ్రాహ్మణాది అగ్రజాతుల వాళ్ళు కనుపిస్తే పక్కకు తొలగిపోయేవాడు. ప్రసాద వితరణ అయ్యేదాకా, ఎంతసేపైనా ఎండలో, వానలో, చలి గాలిలో ఎదురుచూస్తూ నిలబడేవాడు. నాల్గవ జాతి వాడు ఎవరైనా ప్రసాదం తెచ్చి ఇస్తే, చేతిలో ఉన్న కర్ర చాచి దానిపై పెట్టించుకుని, భక్తితో తిని వాళ్ళు ఇచ్చిన నీళ్ళు తాగి, గుడి బయటి ప్రాకారానికి దూరం నుంచి ప్రదక్షిణం చేసి తిరిగి తన ఇల్లు జేరేవాడు.



2.   మాలదాసరి దారితప్పుట-


          ఇలా ఉండగా ఒకనాడు ఆ దాసరి ఇంటి పొరుగున అర్ధరాత్రి గండుపిల్లి ఒకటి కోళ్ళగంపలో దూరింది. ఆ పిల్లిని చూసి ప్రాణభయంతో కోళ్ళు ఒక్క పెట్టున అరిచినాయి. ఆ కోళ్ళ కూతలు విని, తాను నిత్యం బయలుదేరే సమయం వచ్చిందనుకుని దాసరి దేవాలయానికి బయలు దేరాడు.

          చమురు అంటిన తోలు చొక్కా తొడుక్కున్నాడు. తోలు కుళ్ళాయి పెట్టుకున్నాడు. అతని చెవులకు ఇత్తడి శంఖ చక్రాల ఆకారపు పోగులున్నయి. భజన చేసేటప్పుడు వెలిగించే దీపస్తంభాన్ని తీసుకున్నాడు. నీరు నింపు కునే తోలు తిత్తిని భుజానికి తగిలించుకున్నాడు. చేతితో విసరే బాణాలు రెండు తీసుకున్నాడు. మొగలి ఆకులతో చేసిన గొడుగును చేత బట్టాడు. వీణను చిట్టి తాళాలను ధరించాడు. శ్రీహరిని కీర్తించడానికి ఉత్సాహంతో బయలుదేరి ఇల్లు దాటాడు.

          అలా బయలుదేరి పోతూ దారిలో అతను మర్లు మాతంగి తీగను తొక్కాడు. దీనిని తొక్కిన వాళ్ళు దారిని తప్పుతారని ఒక నమ్మకం. అతడు దారి తప్పి తిరుగుతూ, తెల్లవారబోయే సమయానికి, ఒక నిర్మానుష్యమైన అడవికి చేరాడు. అలా దారి తప్పి నడుస్తూ, పల్లేరు కాయలూ, ఉత్తరేణి ముళ్ళూ కాళ్ళకు గుచ్చుకుంటుంటే జాగ్రత్తగా తొలగించుకుంటూ పోతున్నాడు.

          ఆ మార్గంలో రెండు కోసుల నిడివి గల పెద్ద మఱ్ఱి చెట్టుంది. దానికి పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్నయి. ఆ ఊడలకు కొమ్మలూ, రెమ్మలూ ఉన్నయి. ఆ కొమ్మలకు ఉన్న ఆకులకు పురుగులు తొలిచిన కన్నాలున్నయి. గాలికి ఆ ఆకులు దూరంగా కొట్టుకుని వచ్చి, "ఇక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు, రావద్దు." అని హెచ్చరిస్తున్నట్లు ఆ చిల్లులు ఆకుల మీద రాతల్లా అనిపిస్తున్నయి.



3.   మాలదాసరికి బ్రహ్మరాక్షసుడు ఎదురుబడుట-


          ఆ చెట్టును చూసిన దాసరి అక్కడ ఒక కాలి బాటను చూశాడు. ఆ పాడు అడవిలో దారి దొరికిందే చాలని, త్వరత్వరగా ఆ దారిలో నడిచి చెట్టును సమీపించాడు.

          అక్కడ కొబ్బరి బొండాలలో నీళ్ళు తాగి బొండాలు పారేసినట్లు, తలకాయలో మెదడు జుఱ్ఱి పడేసిన పుర్రెలు, లోపలి గుజ్జు బయటి మాంసం గీర గీరి తిని పారేసిన గుర్తులు గల ఎముకలు, ఈగలు ముసురుతూ అక్కడి పొదలకు వేలాడుతున్న పచ్చి ఆరని రక్తం ఓడుతున్న చర్మాలూ, గాలికి ఎగురుతున్న వెంట్రుకల తుట్టెలూ, కోసిన మానవ అవయవాల ముక్కలు, ఆ మాంసపు తునకల కోసం కాట్లాడుకుంటున్న దుష్టమృగాలు, ఎండిపోయి దుర్గంధం వెదజల్లుతున్న మాంసపు వరుగులూ, ఉన్న భీభత్సమైన మార్గంలో పోతున్నాడు దాసరి.

          హఠాత్తుగా అతని మార్గానికి అడ్డంగా ఒక భయంకరమైన ఆకారం కనుపించింది. ఆ ఆకారం ఒక మనిషి కళేబరాన్ని గోచీగా పెట్టుకున్నాడు. అది ఆ ఆకారానికి పొడుగు చాలకపోవడంతో అది ఆ కళేబరాన్ని బాగా లాగి మొలతాడులో దోపుకున్నది. దాని బాన కడుపుకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నయి.

          ఆ ఆకారం నల్లగా చీకటిలా ఉంది. దాని భుజం మీద ఎర్రని దుప్పటి వేలాడుతున్నది. దాని నోట్లో ఎండిన నెత్తురు మరకలు గల తెల్లటి కోరలు మెరుస్తున్నయి. ఏనుగు కుంభస్థలం తిరగేస్తే ఉన్నట్లు దాని గడ్డం రెండుగా చీలి ఉంది. పెద్ద కుండలా మెరుస్తున్న బట్ట తల, దట్టమైన కనుబొమలూ, గడ్డం మీసాలూ జేగురు రంగులో ఉన్నయి. ఆ ఆకారం పొడుగాటి పేగులను జందెంగా వేసుకున్నది. పెద్ద బొజ్జ వేలాడుతున్నది. కాళ్ళు ఏనుగు కాళ్ళలా ఉన్నయి. కళ్ళకింద చర్మం వేలాడుతున్నది. ఆకలి మండిపోతున్నదని బండ తిట్లు తిడుతూ అరుస్తున్నది ఆ ఆకారం.

          మోకాళ్ళు కుండలలా ఉండటం చేత ఆ ఆకారం పేరు కుంభజానుడు. అతడొక బ్రహ్మరాక్షసుడు. ఆ కుంభజానుడు మఱ్ఱి చెట్టు మీద కూర్చుని ఆహారం కోసం ఎదురుచూస్తున్నాడు. దాసరిని చూసి, "చూశాను, కదలకు." అని కింద ఉన్న చెట్లన్నీ నుగ్గునుగ్గయేలా కిందకు దూకాడు.



4.   బ్రహ్మరాక్షసునితో మాలదాసరి పెనుగులాట-


          దాసరి కూడా ధైర్యశాలి అవటం వల్ల, వాణ్ణి ఎదిరించి తన దగ్గరున్న బాణాలతో వాణ్ణి కొట్టాడు. రాక్షసుడు ఆ బాణాలను విరిచి, దాసరిని పడగొట్టాలని చూశాడు. దాసరి పక్కకు తప్పుకుని, ఱొమ్ము విరుచుకుని ఎదిరించాడు. వాడు అరచేతితో చరిస్తే, దాసరి మళ్ళీ కొట్టాడు.

      ఆ రాక్షసుణ్ణి వెనుకకు తోసి పారిపోవాలని ప్రయత్నించాడు దాసరి. అప్పుడు వాడు తన రాక్షస స్త్రీలను పిలిచాడు. వాళ్ళందరూ చెట్టు దిగి రాగా, "అడుగో, ఆ మనిషి పారిపోతున్నాడు, పట్టుకోండి." అని అరిచాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు కుంభజానుడూ, వాడి రాక్షసస్త్రీలు కలిసి దాసరిని పట్టుకున్నారు.

          దాసరి బలవంతుడవటం చేత, తనను పట్టుకున్న వాళ్ళను కాళ్ళతో తన్నుతూ, మోచేతులతో పొడుస్తూ పెనుగులాడాడు. అయినా వాళ్ళు దాసరిని పట్టుకుని చెట్టు మొదలుకు చేర్చారు.

          అప్పుడు కుంభజానుడు ఇలా అన్నాడు. "నా పంచప్రాణాలు తృప్తిపడేలా, నా దాహం చల్లారేలా, నీ తల బద్దలు కొట్టి నీ రక్తం తాగుతాను. ఈ పిశాచస్త్రీలు నీ మాంసఖండాలు కాల్చి పెడుతుంటే తృప్తిగా తింటూ, తాటితోపుల్లోని మనుషుల కపాల పాత్రలలో పొంగిపొర్లే మద్యం తాగుతాను. నన్నింత కష్టపెట్టిన నిన్ను సులభంగా చంపను." అవి ఆ రాక్షసుడు పిచ్చివాడిలా బొబ్బలు పెడుతూ, కత్తినీ, రక్తం పట్టడానికి పాత్రనూ తెమ్మని రాక్షసస్త్రీలకు చెప్పాడు.



5.   బ్రహ్మరాక్షసుడికి దాసరి హితబోధ చేయుట-


      అలా పురమాయించి ఆ రాక్షసుడు దాసరి రెండు కాళ్ళనూ తీగలవంటి పొడుగాటి పేగులతో బంధించి, తర్వాత ఎత్తి ఒక మూటను విసిరినట్లు చెట్టు మొదట్లోకి విసరివేశాడు. అలా విసరివేయబడ్డ దాసరి, అతి కష్టంమీద జరిగి, చెట్టుకు ఆనుకుని కూర్చుని, ఏ విధమైన దుఃఖమూ లేకుండా, ఆ బ్రహ్మరాక్షసుడితో ఇలా అన్నాడు-

          "ఓ రాక్షసుడా! తొందర ఎందుకు? దేవతలు కూడా నిన్ను గెలువలేరు. నేనా నీకు కంచంలో ఉన్న అన్నాన్ని. ఇంక ఎక్కడికి పోతాను? శక్తి ఉన్నంతవరకు ప్రాణ రక్షణకు ప్రయత్నించటం ప్రాణి ధర్మం కాబట్టి, అలా చేయకపోవటం పాపం కనుక నీతో యుద్ధం చేశాను. అందుకు కోపం తెచ్చుకోకు. నాకు ఈ శరీరం మీద వ్యామోహం లేదు. ఈ దేహం నశించటమే మేలు. దాని వల్ల ఈ ఛండాల జన్మ పోతుంది. నీకు తృప్తి కలుగుతుంది. నాకు మోక్షం దొరుకుతుంది. మంచిదే కదా!

          శరీరాన్ని సమర్పించి మోక్షం పొందిన శిబి చక్రవర్తి లోకానికి ఆదర్శప్రాయుడు కాలేదా? రోగంతోగానీ, గాలి సోకిగానీ, తేళ్ళు పాములు కరచి విషం వల్ల కానీ, మనోవ్యాధితో కానీ, నీరు, అగ్ని, జంతువులు, దొంగల వల్ల కానీ, స్త్రీలు, ధనం, వ్యసనాల వల్ల కానీ, పుళ్ళు పడి కానీ, పిడుగు పాటుతో గానీ, వ్యర్థంగా చావక, ఈ శరీరం ఒకరి ఆకలి తీర్చి పోవటం మంచిదే కదా!?

          అది అలా ఉంచి, నేనొక హితం చెప్తాను విను. ఇది నేను ప్రాణభయంతో చెప్పటం లేదు. నువ్వు వినకపోయినా సరే చెప్తాను. ఎందుకంటే ప్రాణుల మంచి కోరి చెప్పే మాటలకు ఈశ్వరుడైనా మెచ్చుతాడు కదా!

      నువ్వు సింహం, పంది, తోడేలు, నక్క మొదలైన క్రూరజంతువులలో ఒకటైన తిర్యక్ ప్రాణివి కాదు. (తిర్యక్కులు= అడ్డంగా నడిచేవి). నువ్వు దేవయోనివి దేవతల కోవకు చెందినవాడివి. విద్యాధరోఽప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః పిశాచో గుహ్యక సిద్ధో భూతోఽమీ దేవయోనయః, (అమరం) అనికదా! ఇక నీకు కూడా మాకు లాగానే కాళ్ళూ చేతులూ మొదలైన అవయవాలున్నయి. మా లాగే మాట లాడగలవు. ఇవి చేయదగిన పనులు ఇవి చేయరాని పనులు అనే ఆలోచన కూడా నీకు మా లాగానే ఉన్నది.

          ఇంకొకటి చెప్పటం మరచాను. కదలలేని చెట్లు, రాళ్ళు, మొదలైన వాటికంటే కదలగలిగే పురుగులు లాంటి వాటికి, వాటి కంటే ఎక్కువగా జంతువులకు, వాటి కంటే ఎక్కువగా పశువులకూ పక్షులకూ, వాటి కంటే ఎక్కువగా మానవులమైన మాకునూ, మాకంటే ఎక్కువగా మీకూ ఇంద్రియ పటుత్వమూ, అవయన పటుత్వమూ జ్ఞానమూ కూడా ఎక్కువే. అటువంటి నీకు యుక్తాయుక్త విచక్షణా, చంపదగినది, చంప దగనిది తిన దగినది, తిన కూడనిది, తాగదగనిది, తాగ తగినది అనే వివేకం లేకుండా ఇటువంటి దుష్టమైన తిండి తగునా?"

          దాసరి బ్రహ్మరాక్షసుడితో ఇంకా ఇలా అంటున్నాడు-

          "పోనీ నువ్వు తినే తిండి శుచిగా, రుచిగా ఉంటుందా, అంటే అదీ కాదు. ఇది పాపకారణమైన హింసతో కూడినది. దీనివలన నువ్వు పరలోకంలో హింస అనుభవించవలసి వస్తుంది. ‘అదేదో బతుకు చివరలో ప్రాణం పోయిన తరువాత కదా! మేము చాలాకాలం బతుకుతాం, మాకెందుకు ఆ భయం? అంటావేమో! చావు అనేది మాకు ఇవాళ వస్తే, మీకు రేపైనా తప్పదు. కాకపోతే ఆ మరునాడు. లేకపోతే యుగాంతానికి. ఎప్పటికైనా తప్పనిదే.

          మునిగిపోవటం తప్పదన్నప్పుడు సముద్రంలో మునిగే మట్టిరేణువుకు పర్వతానికీ తేడా ఏముంటుంది? పూర్వం తపస్సులు, యజ్ఞాలు చేసి దేవతలైన ఇంద్రాదులు రావణ హిరణ్య కశిపాదుల చేతిలో ఓడిపోలేదా? అలా దేవతలను గెలిచిన వాళ్ళు కూడా, ఎన్నేండ్లు బతికినా చివరకు చచ్చి, తాము మునుపు గెలిచిన యముడి చేతికే చిక్కలేదా? ఇక్కడ ఈ లోకంలో మీరు బలవంతులైతే, ఆ లోకంలో యముడు బలవంతుడు. అక్కడ తర తమ భేదాలు లేవు. మాకూ మీకూ యమదండన ఒకటే. నరక యాతన తప్పదు. రాక్షసులైన మీరు, దేవతలైన వారూ అన్నదమ్ములే అయినప్పటికీ, అక్కడ బాంధవ్యాలు పనికిరావు."

      "దేవతలకూ మీకూ ఉన్న ఈ తారతమ్యాలకు కారణం ఆహారం. వాళ్ళు ‘భూర్భువః’ మొదలైన మంత్రాలతో యజ్ఞాలలో ఆహుతులివ్వబడిన అన్నమూ, హవిస్సులను భుజిస్తారు. అందుచేత వాళ్ళు పవిత్రులై, మరణం లేకపోవటం చేత మీ కంటె ఎక్కువ కాలం జీవిస్తారు. ఆ పవిత్రత చేతనే బ్రహ్మదేవుడి అంశ అయిన చంద్రుడు తను కరిగిపోతూ, దేవతలకు అమృతాన్ని పంచుతాడు.

          ఈ విషయాలు మాట్లాడటానికి జన్మచేత అనర్హులం. కాని చంద్రుడి ప్రథమ కళను అగ్ని తాగుతాడని వేదం చెప్తుంది. మిగతా కళలను ఆ యా దేవతలు తాగుతారు. నేను చెప్పింది నీకు నచ్చితే ఆలోచించి ప్రవర్తించు" అని దాసరి చెప్పగా, ఆ బ్రహ్మరాక్షసుడు వికవికా నవ్వి, దాసరితో ఇలా అన్నాడు-



6.   బ్రహ్మారాక్షసుడు హితబోధను పెడచెవిని పెట్టుట-


          "నీ చదువులు ఇంక ఆపు. చెప్పిందే చెప్పి చంపకు. మేం చదవని చదువులా ఇవన్నీ? మేం చదవని వేదాలూ, శాస్త్రాలా? ఇవన్నీ మాకు నచ్చవు. ‘వాళ్ళూ, మేమూ అన్నదమ్ములం అనీ, ఆ దేవతలు అపవిత్రమైనవి తినర’ని గదా అన్నావు? పాడ్యమి నాటి చంద్ర కళను అగ్ని తాగుతాడని కూడా అన్నావు. ఒక్క సంగతి అడుతాను చెప్పు. ఆ అగ్ని సర్వభక్షకుడు కాదా? చాలు చాలు. పెద్దలను అనుసరించడమే మేం చేసే తప్పా? విష్ణువు వాహనమైన గరుడుడు, తనకు చిక్కిన అమృతాన్ని దేవతలకు ఇచ్చి, సర్పాలను ఆహారంగా కావాలని వరం కోరి, తినటం లేదూ? రుచిచేత తన జాతికి విధింపబడిన ఆహారమే తినడానికి ఇష్టపడ్డాడు కదా? ఈ శాస్త్రాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను చంపి తినక మానను." అన్నాడు.

7.   దాసరి కీర్తన వ్రతానికై కురుంగుడికి వెళతానని వేడుకొనుట-


      ఇలా హేళనగా మాట్లాడిన బ్రహ్మరాక్షసుడి పలుకులను విని, వీణ్ణి కెలికితే ఇంకా ఎన్నెన్ని అపభ్రంశపు మాటలను వినవలసి వస్తుందోనని మనస్సులో ఏవగించుకుని, దాసరి వాడి ముఖ ప్రీతికోసం, పరమాత్ముణ్ణి తలచుకుని ఇలా అన్నాడు-

          "అయ్యా! నువ్వు అన్నీ తెలిసినవాడివి. నేనో అల్పమానవుణ్ణి. నీచ కులంలో పుట్టినవాణ్ణి. చదువుకోనివాణ్ణి. నీకు సమాధానం చెప్పగలిగినవాణ్ణి కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు‌. దయతో నన్ను నమ్మి నా ప్రార్థనను విను. నువ్వు రాక్షసులలో కీర్తిమంతుడివి. నీ కీర్తి పెపొందేలాగా నేనొకటి చెప్తాను. విను.

          నీకు నా శరీరాన్ని అప్పగించటానికి అభ్యంతరం లేదు. అయితే నాకు ఒక వ్రతమున్నది. ఏడడుగులు నడిస్తే స్నేహం కలుగుతుందని అంటారు గదా! ఆ మాట చేత ఇప్పుడు మనం స్నేహితులం, అని తలచి నాకొక్క ఉపకారం చెయ్యి. నా వ్రతం సఫలమయ్యేలా అనుగ్రహించు." అని దాసరి ఇంకా ఇలా అన్నాడు-

          "నేను ఈ పవిత్రమైన కురుంగుడిలో వేంచేసి ఉన్న మహావిష్ణువును కీర్తించడాన్ని నియమంగా పెట్టుకున్నాను. ప్రతిదినమూ పాటలు పాడి ఆ వైకుంఠుణ్ణి కొలుస్తుంటాను. ఈ నా వ్రతాన్ని చెల్లించిన తరువాత నేను నీకు ఆహారం అవుతాను. ఆ దేవుణ్ణి సేవించే చివరి అవకాశాన్ని నాకు కల్పించు."

      ఆ మాటలు విని రాక్షసుడు చిరునవ్వు నవ్వి దాసరి బుగ్గపై చిటిక వేసి, "ఓయీ దాసరీ! చాలా చక్కగా అబద్ధం చెప్పావు. అడవిలో దారులు కొట్టి, ఒళ్ళు పెంచుకుని, విరక్తిలోబడి నిన్న గదా దాసరివైనావు. నీ మాటలు నేను నమ్ముతాననుకున్నావా? తప్పించుకుని పోవడానికి భలే ఎత్తు వేశావే!? మెచ్చాను పో.."అని పరిహసించాడు.

          బ్రహ్మరాక్షసుడు దాసరితో ఇంకా-

      "ఎక్కడైనా ఎవడైనా నోటికందిన కూడు వదులుకుంటాడా? ఇలా చెప్పి పోయి మళ్ళీ వచ్చి ప్రాణాలర్పించే వాడెవడైనా ఉంటాడా? కాబట్టి నిన్ను విడిచేది లేదు. చండాలుడా! నీ మాటలు నేనా నమ్మేది? ఇక నీ అరుపులు, విచారాలు, అధిక ప్రసంగాలతోటి ప్రయోజనం లేదు." అన్నాడు.

          అటువంటి మాటలు విన్న దోషానికి దాసరి 'నారాయణా ' అని చెవులు మూసుకున్నాడు. తనను నమ్మమని శపథాలు చేశాడు. ఒట్లు వేసుకున్నాడు అయినా రాక్షసుడు వినలేదు. అప్పుడు దాసరి-

      "నేను చెప్పినట్లు తిరిగి రాకపోతే, ఎవరి చూపు వల్ల ఈ జగతి పుడుతుందో, ఎవరి లోపల ఉంటుందో, చివరకు ఏ పురుషుడిలో ఈ జగత్తు సర్వం లీనమవుతుందో ఆ విష్ణుదేవుడితో సమానంగా ఇతర దేవుళ్ళను గణించిన పాపిని అవుతాను." అని పలికాడు.



8.   తిరిగి వచ్చిన దాసరిని చూసి రాక్షసుని మనస్సు మారుట-


          అప్పుడు బ్రహ్మరాక్షసుడు దాసరి మాటలు నమ్మాడు. దాసరి కట్లు విప్పాడు. దానితో దాసరి ఏదైనా కొంచెం పాపం చేసి ఉంటే, దీనితో చెల్లిపోయింది. వెంటనే దాసరి తన వీణ మీటుకుంటూ కురుంగుడి వైపు వేగంగా సాగిపోయాడు. కురుంగుడి చేరి పెరుమాళ్లు పరవశించేలా కీర్తించాడు. తృప్తి తీర స్వామిని సేవించాడు. అసత్యదోషం ఎక్కడ తగులుతుందో అనే భయంతో, వేగంగా వచ్చి బ్రహ్మరాక్షసుడి ముందు నిలబడి, వ్రతం పూర్తయిందన్న సంతోషంతో ఇలా అన్నాడు-

          "నువ్వు నన్ను విడిచి పెట్టినప్పుడు నా కాళ్ళు, కడుపు, వక్షము, తలా, చేతులూ, కాళ్ళూ ఎలా ఉన్నయ్యో, ఇప్పుడు కూడా అలానే ఉన్నయి. చూసుకో, " అన్నాడు.

          దాసరి మాటలు విని, అతని సత్యనిష్ఠకు నివ్వెరపోయి, కళ్ళలో ఆనందబాష్పాలు నిండి, పొంగి పొర్లి, చెక్కిళ్ళ పైనుండి కారుతుండగా, సంతోషంతో పులకించిన శరీరం గలవాడై, మధ్యాహ్నపు సూర్యుడి ఎండలో తన పెద్ద బట్టతల మెరుస్తుండగా, బ్రహ్మరాక్షసుడు దాసరి దగ్గరకు పరువెత్తుకుని వచ్చాడు.

          దాసరికి నమస్కరిస్తూ అతని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఏనుగు కూలినట్లు తటాలున దాసరి పాదాలపై వాలి, తల దాసరి పాదాలకు తగిలేలా నమస్కరించాడు. కొండలు మారుమోగే స్వరంతో దాసరిని అనేక విధాల స్తుతించాడు. అతని పాదాలు ఎక్కొక్కటే ఎత్తి తన తలపై పెట్టుకున్నాడు-           "దేవతలు, రాక్షసులు, మునులు, రాజులు ఇంకా గొప్పవాళ్ళు అనబడే ఎవరిలోనూ నీయంత సత్యనిష్ఠ లేదు. నేను చాలా కాలం నుంచి బతికి ఉన్నాను కనుక, అనుభవంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు ఇంక ఎవరూ సాటి రారు. కురుంగుడి స్వామిని నీ వీణాగాన రసప్రవాహంలో ముంచి, ఆయన కృప పొందిన నీకు, నీ ధైర్యానికి, నీ సత్యసంధతకు, నీ జీవనవిధానానికి సాటి ఎవరూ లేరు." అన్నాడు.

          అది విని దాసరి ఆ కుంభజానుడితో, "నువ్వు నా గానవ్రతాన్ని పాలించేలా చేశావు" అని అతనిని తన కౌగిలిలో చేర్చాడు.

          దాసరి బ్రహ్మరాక్షసుడితో, "ఓ రాక్షసశ్రేష్ఠుడా! నీ దయవల్ల ధన్యుడినయ్యాను. నేను ప్రమాణం చేశాను గదా అని మళ్ళీ తిరిగి వస్తానని నమ్మి నన్ను విడిచి పెట్టావు. ప్రమాణాలు, శపథాలదేముంది? ప్రాణభయం వల్ల లక్షప్రమాణాలు చెయ్యవచ్చు. దానిని నమ్మి నోటి దగ్గరి అన్నాన్ని విడిచిపెట్టటం సామాన్యమైన విషయమా? అలా చెయ్యటం నీకే చెల్లింది.

          ఎంతయినా నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టిన పుణ్యాత్ముడివి. నీతో ఉండటంవల్ల నీ కుటుంబమంతా పుణ్యాత్ములే. నువ్వు ఆకలితో నకనకలాడుతూ కూడా, నా వ్రతం పూర్తిచేయించి, నన్ను కృతార్థుణ్ణి చేయడానికి విడిచిపెట్టావు. మేము నీకు జాతిధర్మం ప్రకారం బ్రహ్మదేవుడు నిర్ణయించిన ఆహారం. దీనివల్ల మీకేమీ దోషం లేదు. ఇక నువ్వు ఏం మాట్లాడినా ఒట్టే సుమా! నీకు నాయందు స్నేహం, ప్రేమ ఉంటే నన్ను తిని నీ ఆకలి తీర్చుకో. నా మాటలలో కపటం లేదు. దానికి అంతర్యామి అయిన పరమేశ్వరుడే సాక్షి. నా శరీరంలోని మెదడు, మాంసం, కొవ్వు ప్రియమార తిను" అన్నాడు.



9.   బ్రహ్మరాక్షసుని విన్నపము-


అప్పుడు ఆ రాక్షసుడు జాలిగా ఇలా అంటున్నాడు-

          "అయ్యా! ఇలా నా మీద దయలేకుండా పలుకవచ్చునా? ఇన్నాళ్ళూ ఈ పాపపు కూడే తింటూ, దానిచేత ఒళ్ళు పెంచుకుని, ఎప్పటికైనా ఎవరో ఒక పుణ్యాత్ముడు రాకపోతాడా? ఈ పాపిష్ఠి రాక్షసజన్మ నుండి విముక్తి కలుగకపోతుందా?" అని ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి నువ్వు నాకు దొరికావు. ఓ పుణ్యాత్ముడా! ఇలా మాట్లాడతగునా?

      "మీ వంటి భాగవతులు మా వంటివాళ్ళను పవిత్రులను చేయకపోతే, మాకింక గత్యంతరం ఏముంటుంది? మేము పూర్వం చేసిన పాపకార్యాలను గణింపక, మా మీద దయచూపించు. పరుసవేది ఇనుమును బంగారం చేసినట్లే, మీరు మమ్మల్ని పవిత్రులను చెయ్యాలి." అని జాలిగా బతిమిలాడాడు ఆ బ్రహ్మరాక్షసుడు.

          అతడిని దాసరి "నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.

          అప్పుడు రాక్షసుడు, "అయ్యా! నువ్వు నా బ్రహ్మరాక్షసత్త్వాన్ని పోగొట్టగలవు. ఆ ఉపకారం చెయ్యకుండా, ‘శరీరాన్ని ఇస్తాను, తినమ’ని అనటం నీకు భావ్యం కాదు. ఇంకా నేను చేసిన పాపాలు పూర్వం ఘంటాకర్ణుడనే రాక్షసుడు చేసినంతటివి కావు. భగవంతుడే కరుణించి, అతని పాపాలు పోగొట్టి, మోక్షాన్ని ఇవ్వగా, భాగవతులు ఇవ్వలేరా? ఆ మాత్రం ఉపకారం నువ్వు నాకు చెయ్యగూడదా? ఒక ప్రాణికి మేలుచేయటం పరమేశ్వరుణ్ణి పూజించటంతో సమానం కాదా? కాబట్టి నన్ను రక్షించు." అన్నాడు.

          అప్పుడు దాసరి, "నేను చేయవలసినదేమిటో స్పష్టంగా చెప్పు." అన్నాడు. అది విని బ్రహ్మరాక్షసుడు దాసరికి తన కథను ఇలా చెప్పాడు-

          "అయ్యా! నా పేరు కుంభజానుడు. నేను బ్రహ్మరాక్షసుణ్ణి. ఈ మఱ్ఱిచెట్టును ఆశ్రయించి, ఈ దారిన పోయే మనుషులను పట్టి తింటూ బతుకుతున్నాను.

          నువ్వు మహావిష్ణుభగవానుణ్ణి కీర్తించిన ఒకనాటి పాటల ఫలాన్ని నాకు ధారపోస్తే, రోతపుట్టించే ఈ బ్రహ్మరాక్షస జన్మ కడతేరుతుంది. నీకు కూడా దీనులను రక్షించిన పుణ్యఫలం అనంతంగా సిద్ధిస్తుంది. ధర్మసాధనమైన నీ శరీరం నీ ఇల్లు జేరుతుంది." అన్నాడు బ్రహ్మరాక్షసుడు దాసరితో.



10.       దాసరికి రాక్షసునికి పాటఫలవిషయమై సంవాదం-


          ఆ మాటలు విని నవ్వి హరిదాసుడు ఇలా బదులిచ్చాడు-

          "ఇప్పటివరకూ ఈ శరీరాలు, ఇంతకంటే గొప్పవీ, ఇంతకంటే నీచమైనవీ ఎన్నో ధరించి ఉంటాను. వాటిలో ఇదీ ఒకటి. ఈ శరీరం కోసం ఒకనాటి పాటఫలం కాదు గదా, ఒక చిటిక వేసినంత కాలపు పాటఫలం కూడా ఇవ్వను.

          అదీగాక నువ్వూ నేనూ ఎన్ని జన్మలెత్తి ఉంటామో! దిక్పాలకుడై పుట్టినా, భిక్షగాడై పుట్టినా, ఏనుగుగా పుట్టినా, దోమగా పుట్టినా, సింహంగా పుట్టినా కీటకంగా పుట్టినా, యజ్ఞం చేసే సోమయాజిగా పుట్టినా, కుక్క మాంసం తినే ఛండాలుడిగా పుట్టినా, రాజుగా పుట్టినా సేవకుడిగా పుట్టినా, ఆ యా పాపపుణ్యాలు క్షయమై పోగానే మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తుతూనే ఉంటాం. కానీ కృష్ణభక్తుడిగా జన్మనెత్తటం మాత్రం దుర్లభం. ఈ శరీరం నీరు నిలువని చేపల బుట్ట. సాలె గూటితో కట్టిన మూట. వడగాలిలో ఆరబెట్టిన దూది. ఎండలో బెట్టిన పసుపు (రంగు నిలువదు), బోసినోటి వాడు పలికే అక్షరం. ఇటువంటి శరీరంకోసం పుణ్యాన్ని అమ్ముకోవటమంటే కర్పూరాన్ని అమ్మి ఉప్పు కొనుక్కున్నట్లు." అన్నాడు

          అప్పుడు బ్రహ్మరాక్షసుడు దాసరితో, "ఓ పుణ్యాత్ముడా! నువ్వు పాట పాడిన పుణ్యంలో సగమైనా దయతో ధారపొయ్యి. అందువల్ల నీ పుణ్యానికేమీ కొదువ కాదు. చేప మింగిన గుక్కెడు నీళ్ళు సముద్రానికి తక్కువౌతాయా?" అన్నాడు.

          అది విని దాసరి, "అయ్యా! ఎందుకు ఇవ్వలేనిది అడిగి నన్ను బాధిస్తావు? నేను నీకు ఇస్తానన్నది నా శరీరాన్నే కానీ విష్ణుకీర్తన ఫలాన్ని కాదు గదా? ఇలా తర్కిస్తూ భేతాళ ప్రశ్నలు వేస్తున్న కొద్దీ, మరిన్ని ప్రశ్నలు పుట్టటం తప్ప ఏమీ లాభం లేదు. ఇవేమీ వద్దు. నా శరీరాన్ని తీసుకో." అన్నాడు.

          ఆ మాటలు విని బ్రహ్మరాక్షసుడు చాలా బాధపడ్డాడు. కళ్ళలో నీళ్ళు నిండి బొటబొటా కారినయి. ఆ దుఃఖాన్ని ఎలాగో అణుచుకున్నాడు. "అయ్యయ్యో! విష్ణుభక్తులు దయార్ద్ర హృదయులు కావాలి గదా! పూర్వం విశిష్ఠాద్వైత ప్రవర్తకుడైన శ్రీమద్రామానుజాచార్యుల వారు చిరకాలం చేసిన శుశ్రూషకు ప్రసన్నుడై ఆయన గురువైన పెరియనంబి, అనధికారులకు ఉపదేశించవద్దని ఆదేశించి, తనకు ఉపదేశించిన నారాయణ మంత్రాన్ని, విశేషకృపతో శ్రీరంగ మందిర గోపురమెక్కి పెద్ద గొంతుతో అందరూ వినేలా పలుకలేదా?

          అప్పుడు ఆచార్యులు తన మీద అలిగితే, ఆయన గురువుగారితో, 'స్వామీ! మీ ఆజ్ఞను ఉల్లంఘించక నేనొక్కణ్ణే రౌరవాది నరకాలలో పడకుండా ఉండటమో, లేక భాగవతులందరికీ ఉపదేశించి వాళ్ళందరూ మోక్షం పొందేలా చెయ్యటమో ! ఏది మంచిది అని ఆలోచించి ఇలా చేశాను.' అన్నారు. ఆ మాటలకు గురువు గారు కూడా సంతోషించి, శిష్యుణ్ణి అభినందించారు గదా! ఆ రామానుజలవారే తన శిష్య, భాగవత కూటములకు వెల తీసుకోకుండా ప్రతిరోజూ పాలూ, పెరుగూ, నెయ్యి సమర్పించిన గొల్లలకు మోక్ష మార్గం చూపించలేదా? ఆయనే మరో జన్మలో సుందరజామాత్రుడనే పేరుతో అవతరించి, అజ్ఞానులై, విషయాసక్తులైన నరులకు మోక్షాసక్తి కలిగేలాగా అర్చిరాది మార్గాన్ని బోధించారు గదా! అటువంటి విష్ణుభక్తుల కోవలోని వాడవై కూడా, ఇంత మాత్రం దయ లేకపోవటం ఏమిటి? పోనీ! విష్ణుసంకీర్తనా ఫలంలో నాల్గవవంతైనా ఇవ్వు." అని అర్థించాడు.

          దాసరి దానికి కూడా అంగీకరించక పోగా, చివరకు బ్రహ్మరాక్షసుడు ఈ నాటి ఉదయం పాడిన చివరి గీతం ఫలం ధారపొయ్యమని కాళ్ళా వేళ్ళా పడి, కన్నీరు ధారలై పారగా యాచించాడు.



11.       బ్రహ్మరాక్షసుని పూర్వవృత్తాంతము; సోమశర్మ కథ-


          బ్రహ్మరాక్షసుడు అలా అనేక విధాల ప్రాధేయపడగా, దాసరి దయార్ద్ర హృదయుడై, అతనిని లేవనెత్తి, అతను కోరింది చేస్తానని ఒప్పుకుని, "నీకు ఈ బ్రహ్మరాక్షసుడి రూపం ఎలా వచ్చింది?" చెప్పమని అడిగాడు.

          అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, "నేను చోళదేశంలోని ఒక గ్రామవాసిని. నా పేరు సోమశర్మ. గురువులకు శుశ్రూష చేసి పదునాలుగు కళలు నేర్చి నాలుగు వేదాలు అధ్యయనం చేశాను. న్యాయ, మీమాంస, తర్క, ధర్మశాస్త్రాలు, శిక్షా, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, జ్యోతిష్యం మొదలైనవన్నీ నేర్చి, తర్కశాస్త్ర పండితులను వాదంలో ఓడించేవాణ్ణి. యాగ తంత్రజ్ఞులను తప్పుపట్టే వాణ్ణి. విద్వాంసులను పండితులను వెక్కిరించేవాణ్ణి. నోరు పెట్టుకుని వాదించి అందర్నీ అవమానించే వాణ్ణి. నాకున్న అల్ప విద్యకే గర్వంతో అహంకరించి, మదపుటేనుగులాగా ప్రవర్తిస్తూ, ఎక్కడైనా ఓడిపోయినా గెల్చానని అరిచి యాగీ చేసి అల్ప ప్రభువులను మెప్పించేవాణ్ణి.

          ఇలా ఉండగా ఒకనాడు కొందరు యజ్ఞం చేస్తుంటే చూసి, నాకు కూడా యజ్ఞం చెయ్యాలని బుద్ధి పుట్టింది. దానికి ధనం కావాలి కనుక, ధనార్జన కోసం మథురా పట్టణానికి వెళ్ళాను.

          మథురా పట్టణంలో ఒక బ్రాహ్మణుణ్ణి వెలి వేస్తే, కొంచెం ప్రాయశ్చిత్తం చేయించి, ధనం కోసం వాడితో సహపంక్తి భోజనం చేశాను. కోమట్ల పురోహితులతో కూడి పుణ్యాహవాచనాలు చేయించి బియ్యం కోసం పోట్లాడేవాణ్ణి. సూర్య, చంద్ర, గ్రహణాలలో చేసే జపాలూ, స్నానాలూ మొదలైనవాటి ఫలితాలన్నింటినీ ధనవంతులకే ధారపోసేవాణ్ణి. పచ్చి కృష్ణాజినాలూ, గేదె, ఎనుము, ఆవులు, మేకలను దానాలు పట్టడానికి పట్టణమంతా నేనే గుత్తకు తీసుకొని, బ్రాహ్మణార్థాలు, తద్దినపు భోజనాలు చేసేవాణ్ణి. బ్రాహ్మణార్థాలు లేనప్పుడు పూటకూళ్ళ ఇళ్ళల్లో చాలీ చాలని తిండి తినేవాణ్ణి. తులాభార దానాలు తీసుకునేవాణ్ణి.

          ఇలా ధనం కోసం చేయదగినవి, చేయకూడనివీ ఎన్నో చేసి కడుపునిండా తినకుండా కూడబెట్టిన ధనం అంతా ఒక వైశ్యుడికి వడ్డీకి ఇచ్చాను. తరువాత మా గ్రామానికి పోయే సమయం వచ్చినప్పుడు ఆ వైశ్యుడికి తప్పుడు లెక్కలు చెప్పి, వాణ్ణి రచ్చకు ఈడ్చి పోట్లాడి నానా యాగీ చేసి, ధనం తీసుకుని పోయి కొత్త చెప్పులు కొని అవి కరవకుండా నూనె పూసి, సొగసుగా కనుబొమలు గొరిగించుకుని పూటకూటింట్లో ఎప్పటి కంటే ఎక్కువగా పాలు, పెరుగు, నెయ్యీ బాగా వేయించుని కడుపు నిండా తృప్తిగా తిన్నాను. తరువాత ఇంట్లో ఉన్నవాళ్ళకు బట్టలూ నగలూ కొని, మా ఊరువైపు వెళ్ళేవాళ్ళను మన ప్రయాణం ఎప్పుడని అడుగుతుంటే దొంగ ఒకడు ఇదంతా గమనించాడు.





[గమనిక: దీని వల్ల మనకు రాయల వారి కాలంలో, అంటే 16వ శతాబ్దం లోనే కనుబొమలు కత్తిరించు కోవటాలూ, పూటకూళ్ళలో కొసరటాలూ, మొదలైనవి ఉన్నట్లు తెలుస్తున్నది. పురోహితులు కొందరు ఆ రోజులలో కూడా ధనానికి ఇచ్చే ప్రాధాన్యం, వడ్డీలకి ఇవ్వటం లాంటి సాంఘిక పరిస్థితులు తెలుస్తయి. సార్వభౌముడైనప్పటికీ రాయల నిశిత పరిశీలనా శక్తి ద్యోతకమౌతుంది. ఆ దృష్టితో చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.]



12.       దొంగలముఠా దాడి చేయుట-


          ఆ దొంగ మమ్మల్ని వెంబడించమని కొందరినీ, ముందుగా వెళ్ళి మా మార్గాన్ని అరికట్టమని మరి కొందరినీ పంపి, తాను కూడా ప్రయాణీకుడిలాగా సంచీ ఒకటి తీసుకుని, మా వెంట వస్తూ, పెద్దగా అరుస్తూ మేం పోవలసిన దిశను సూచిస్తుండగా, నేను కూడా నా మూటను నా శిష్యుడి నెత్తిన పెట్టి, బయలుదేరాను. అప్పుడు ఆ దొంగ మమ్మల్ని దారి తప్పించి, దగ్గర దోవ అని చెప్పి, అడవి మార్గం పట్టించాడు.

          అలా పోయి పోయి ఒక చోట విశ్రాంతికై దిగగానే, వాడు పెద్దగా ఈల వేశాడు. అప్పుడు కనురెప్పపాటులో ఒక బాణం దారికి అడ్డంగా వచ్చి పడింది. దాని వెంటనే రాళ్ళ వాన కురిసింది. మాకు వెళ్ళటానికి దారి లేక వెనక్కి తిరిగాం. ఇంతలో, ప్రళయ కాలంలో ప్రాణులను కబళించడానికి వచ్చే ఆకలివంటి వేగంతోనూ, ఆకాశం నుండి ఉల్కలు రాలినట్లుగానూ, సూర్యుణ్ణి గ్రహణసమయంలో మింగటానికి వచ్చిన రాహువుల గుంపులాగానూ, కిరాతుల, ఛండాలులతో కూడిన దొంగల గుంపు, 'కొట్టు కొట్టు, పొడుపొడు, చంపు చంపు' అని కేకలు పెట్టుకుంటూ మమ్మల్ని చుట్టుముట్టింది.

          ఆ విధంగా విళ్ళెక్కుపెట్టి మీదకు వస్తున్న దొంగల మూకను చూసి ప్రయాణీకులలో కొందరు, "దొంగలు ఎక్కువమంది లేరు. నిలవండి." అని హోమసమిధలైన కఱ్ఱలు తీసుకుని ఎదిరించేవాళ్ళూ, భయపడి సొమ్ములు చెట్ల మొదళ్ళలో పడేసి దెబ్బలు కాచుకుంటూ పరుగెత్తుకుని పోయేవాళ్ళూ, భుజాలపైన, తలపైన ఉన్న మూటలను దించి ఆయుధాలు ధరించి దొంగలను, "ఎక్కడికి పోతార్రా, ఆగండి", అని ఎదిరించేవాళ్ళూ, "ఇవిగో ఈ బట్టలను తీసుకుని, ఈ నగలనూ వస్త్రాలనూ వదిలేయండి, ఇవి దేవతల సొమ్ములు." అని బతిమాలే వాళ్ళూ, "మమ్మల్ని కొట్టకండి. మా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇప్పిస్తాం" అని చెప్పేవాళ్ళూ, "అయ్యో! ఆడవాళ్ళను తాకకండి. మీకు కావలసినవి వాళ్ళే ఇస్తారు. సొమ్ము పోతే పోయింది. ఆడవాళ్ళను తాకకుండా ఉంటే చాలు." అనే పెద్ద మనుషులూ, "అక్కడే దూరంగా ఉండండి, దగ్గరకు రాకండి." అంటూ నిలువు దోపు ఇచ్చే జనంతో ఆ ప్రదేశం గందరగోళంగా తయారయింది.

          ఆ దొంగలు విల్లు బాణాలు ఉన్న వాళ్ళ జోలికిపోలేదు. ఎవడైనా ధనం ఇవ్వక పెనుగులాడుతూ ఉంటే వాణ్ణి ఎక్కువగా నొప్పించక, మచ్చుకు నెత్తురు కారేలా పొడిచి, భయపెట్టి ధనం లాక్కున్నారు. ధనం లేనివాళ్ళను పక్కకు పంపించివేశారు. పొదలలో దూరి దాగినవాళ్ళను, ఈటెలు దూర్చి పొడుస్తామని భయపెట్టి బయటకు రప్పించి దోచుకున్నారు. తప్పించుకుని పారిపోతున్నవాళ్ళ వెంట పడకుండా, ఉన్నవాళ్ళనే దోచుకున్నారు. విలువైన బట్టలు కట్టుకున్న వాళ్ళ బట్టలు విప్పించి దోచుకుని, పుట్ట గోచులిచ్చి కట్టుకోమన్నారు. గన్నేరు ఆకులలాంటి పలచటి మొనలు కలిగిన బాణపు ములుకులతో చెప్పుల అడుగు అట్టలను చీల్చి, జుట్టు ముడులు, కొప్పులు విప్పించి, అక్కడ ధనం దాచారేమోనని వెదికారు.

13.       సోమశర్మ దుర్గతి-


          ఇలా జరుగుతుండగా, నేను నా శిష్యుడితో కూడా తప్పించుకోవాలని ప్రయత్నించాను. అది ఒకడు కనిపెట్టి నాకు అడ్డంపడ్డాడు. వాడు నడుము నుండి ఱొమ్ము వరకూ కప్పేలా నీలి రంగు కాసె కోక కట్టుకున్నాడు. వాడి పొడుగాటి మీసాలు వాడి పిల్లిగడ్డాన్ని దాటి, గుండ్రటి పొట్టమీద నాట్యం చేస్తున్నయి. ఒంటినిండా దట్టంగా బూడిద పూసుకున్నాడు. వాడి నడుముకు చురకత్తి, చేతిలో కొంకి కత్తి ఉన్నయి. వాడు నన్ను బయలుదేరినప్పటి నుండీ కనిపెట్టి ఉన్నాడు. కాకి మీసాలుగాడు (కాకశ్మశ్రుడు) అనబడే వాడు, మమ్మల్ని అడ్డగించి, నేను పరుగెత్తుతుండగా, వాడి కొంకికత్తిని నా మోకాళ్ళకు తగిలించి లాగి, నన్ను కిందపడేశాడు. నా మీద కూర్చుని నా పొట్ట ఎత్తుగా ఉండటం చూసి అక్కడ ధనం దాచుకున్నానని కనిపెట్టి నా ధోవతిని లాగి, నేను పెనుగులాడుతూ ఉంటే వరహాల మూట చేజిక్కించుకున్నాడు. నా చెవి తమ్మెలు తెగేలా బలంగా లాగి నా చెవి పోగులు తీసేసుకున్నాడు. నా చెవులు మూసుకునేలా నా తలపై పెట్టుకున్న కుళ్ళాయిని కూడా లాగేసుకున్నాడు.

          అలా అన్నీ దోచుకుని వాడు వెళ్ళిపోతుండగా, నేను నా నోటి శనిచేత ఊరికే ఉండక, సొమ్ము పోతున్నదన్న కడుపు మంట కొద్దీ, "ఒరేయ్! నువ్వు మా పక్క ఊళ్ళో ఉండేవాడివే గదా! ఎంత దూరం పోయినా ఈ ధనం నీకు దక్కుతుందా? కానీరా" అన్నాను. వాడది విని, 'ఈ బాపడు చాలా పోగొట్టుకున్నందు వల్ల, వీడు రాజుకో, రెడ్డికో చెప్పి పట్టించి, శిక్ష వేయించక మానడు', అనుకుని పోతున్నవాడు తిరిగివచ్చాడు.

          వాడి గుంపు వాణ్ణి వదలి, చాలాదూరం పోయి ఉండటంవల్లనూ, వెనుకనుంచి వేరే బాటసారుల గుంపు వస్తున్న సవ్వడి వినిపిస్తుండటం వల్లనూ, వాడు ఆదరాబాదరాగా నన్ను ఇష్టం వచ్చినట్లు పొడిచి పారిపోయాడు. ఇంతలో, వెనుక నుంచి వచ్చిన ప్రయాణీకులలో నా బావమరది ఉన్నాడు. వాడు నన్ను సమీపించి, విషయం తెలుసుకుని బావురుమని ఏడిచాడు. తరువాత నన్ను ఒక కావడిలో కూర్చోబెట్టుకుని మోసుకుని పోతూ, గాయల వల్ల నేను పడే బాధనుండి నా మనసు మళ్ళించడానికి బావమరది కనుక నా తప్పులెంచి నన్ను వెక్కిరిస్తూ నడుస్తున్నాడు.

          ఆ దొంగల బారిన పడ్డ ప్రయాణీకులలో కొందరు కత్తిదెబ్బల వల్ల కలిగిన గాయాలను వేళ్ళతో అదిమి పట్టుకుని, కుట్లు వేయించుకోవటానికి వైద్యుడి కోసం వెదకేవాళ్ళూ, దుడ్డుకర్రల దెబ్బలవల్ల తలకు తగిలిన గాయాలకు గుడ్డ కాల్చిన మసిపోసి అదిమిపట్టి, ఇంటింటికి తిరిగి తిండి యాచించేవాళ్ళూ, దయతో అన్నంపెట్టి బట్టలు ఇచ్చినవాళ్ళను ఆశీర్వదించేవాళ్ళూ, దోపిడీ జరిగిందని వంకతో అయినవీ, కానివీ కష్టాలు ఏకరువు పెట్టి చుట్టాలిండ్లలో తిష్ఠ వేసేవాళ్ళూ- ఇలా సందడిగా ఉన్న గ్రామాల మీదుగా నా బావమరది నన్ను ఈ చోటికి తీసుకుని వచ్చి, ఈ మఱ్ఱిచెట్టు కింద కావడి దించి, దగ్గరలో ఉన్న ఏటిలో నీళ్ళు తాగడానికి వెళ్ళాడు.

          వాడు తిరిగి వచ్చే లోపలే నాకు గాయాలవల్ల బాగా రక్తం కారిపోవటంవల్ల ప్రాణాలు పోయినయి. వెంటనే ఈ బ్రహ్మరాక్షస రూపం వచ్చింది. నన్ను దోచుకున్న ఆ కాకశ్మశ్రుడు (కాకి మీసాలవాడు) నన్ను నరికినప్పుడు, వాడి భయంకరాకారం కళ్ళ ముందే ఆడుతుండగా, చనిపోయిన వేళ నాకు ఈ భయంకరమైన రూపం కలిగింది. అంత్య కాలంలో దేనిని స్మరిస్తూ మరణిస్తే అదే కలుగుతుంది గదా! ఇప్పుడు నువ్వు నీ మంగళకైశికీ గానఫలం ధారపోసి నా ఈ వికృతాకారాన్ని పోగొట్టు." అని ప్రార్థించాడు ఆ బ్రహ్మరాక్షసుడు.



14.       బ్రహ్మరాక్షసుడు సోమశర్మగా అగుట-


          అప్పుడు ఆ భగవద్దాసుడు, "నేను ఫలమేమో ఎరుగను. ఆ ఫలం, వేదశాస్త్రముల చేత విధింపబడ్డ కర్మఫలాలు, సేవకుడు చేసే భగవత్కీర్తన ఫలాలు ఇంత, అంత అని లెక్కబెట్టటం భగవద్దాసులకు కూడని పని. అదీగాక ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు బంధకారణాలై, పునర్జన్మ హేతువులు అవుతాయి. కనుక ఆ గానఫలం ఇంత అంత అనీ, అందులో కొంత నీకు ఇస్తాననీ అనటానికి నాకు భయం కలుగుతుంది. శ్రీపతే నిన్ను రక్షిస్తాడు. ఊరడిల్లు." అన్నాడు.

          దాసరి ఎప్పుడైతే, "దిగులు పడకు, నిన్ను శ్రీహరే రక్షిస్తాడు." అని అన్నాడో, అతని నోటిలోని మాట నోటిలో ఉండగానే, ఆ బ్రహ్మరాక్షసుడు-

          శిరస్సు మీద మూడు భాగాలు నున్నగా క్షౌరం చేయబడి, శిఖగా మిగిలిన ఒక భాగంతోనూ, మంచులా తెల్లగా మెరుస్తున్న యజ్ఞోపవీతంతోనూ, శరీరంమీద పన్నెండు చోట్ల లతలలా దిద్దిన ఊర్ధ్వపుండ్రాలతోనూ, మెడలో తులసిపూసలూ, తామరపూసల దండలతోనూ, కౌపీనమూ, మొలతాడూ, కాషాయ వస్త్రాల జత ఒకటి ధరించి, ఇంకొకటి ఉత్తరీయంగానూ దాల్చి, పుణ్యతీర్థంతో నిండిన కమండలువుతోనూ, చేతిలో దివ్య ద్రావిడప్రబంధంతోనూ, వెలిగిపోతూ, ద్వయ మంత్ర సంధానం చేస్తూ, బ్రహ్మవర్చస్సుతో భాగవతకాంతితో ప్రకాశిస్తూ, పొగ మండలంలోనుంచి వెడలే అగ్నిజ్వాలలాగా, ఆ రాక్షసశరీరం నుండి బయటకు వచ్చి, చూస్తుండగానే సోమశర్మ వైష్ణవుడై నిలుచున్నాడు.

          ఈ విధంగా భాగవత పరిచయభాగ్యం వల్ల, బ్రాహ్మణత్వమే గాక, భాగవత సంపద కూడా కలిగి, పరమానంద భరితుడై, సంప్రదాయానుసారంగా దాసరిని పూజించి, ఇలా స్తుతించాడు-

          ఓ భక్త శిఖామణీ! సంసారాన్ని తామరాకు మీద నీటిబొట్టులా అంటీ అంటనట్లు ప్రవర్తించే వాడా! నీకు జయం. గాయక సార్వభౌమా! నీకు జయం. శ్రీహరి పవిత్ర చరిత్ర సారాన్ని ఎరిగినవాడా! నీకు జయం. నీచ జన్మమనే ముసుగులో మహా మహిమను దాచినవాడా! నీకు జయం. జన్మరాహిత్యం పొందిన వాడా! నీకు జయం. ఆచార్యుల శ్రీచరణాలే రక్షణగా కలవాడా! నీకు జయం. సత్యపదార్థమునందు బుద్ధిని నిలిపి, దేహం మీద మమకారం లేనివాడా! నీకు జయం. భగవదాజ్ఞకు బద్ధుడైనవాడా! నీకు జయం. సకల ప్రాణులనూ సమదృష్టితో చూసేవాడా! నీకు జయం. విష్ణువుకంటే వేరు దైవం లేడనే దృఢనిశ్చయం గలవాడా! నీకు జయం. విష్ణు భక్తులయందు ప్రేమ, విష్ణుపూజయందు నిష్ఠ, దంభాన్ని విడిచిపెట్టటం, విష్ణు కథలు వినటంలో ఆసక్తి, సర్వాన్నీ విష్ణుపదారవిందాలకే సమర్పించటం, విష్ణుస్మరణ మొదలైన అష్టవిధ భక్తులయందు ఆసక్తి కలిగినవాడా! నీకు జయం. మురారి భక్తుల పాదపద్మాలయందు తుమ్మెదయైన వాడా! నీకు జయం!" అని స్తుతించి, దాసరికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సోమశర్మ. ఇల్లు, భార్యా పుత్రుల మొదలైనవాటిమీద విరక్తిచెంది, బదరికారణ్యం ఆదిగాగల విష్ణుక్షేత్రాలకు తీర్థయాత్రలు చేస్తూ పరమ సుఖదాయక మైన మోక్షాన్ని పొందాడు.

          ఈ కథను విన్నవాళ్ళూ, చదివినవాళ్ళూ, విష్ణుభక్తికి జాతిభేదాలు లేవని గ్రహించి, సర్వజీవులనూ సమానదృష్టితో చూస్తూ, అందరిలోనూ, అంతటా విష్ణుభగవానుడు ఉన్నాడని తెలుసుకుని, విష్ణుభక్తులై జన్మరాహిత్యాన్ని పొందుతారు.

          సర్వే జనాః సుఖినో భవంతు.

          ఈ- ఆంధ్రభోజుడని బిరుదు వహించి, సా.శ. పదహారో ‌శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన- శ్రీకృష్ణదేవరాయలు రచించిన 'ఆముక్తమాల్యద' పద్యకావ్యం లోనిది. 🙏